వైభవంగా వట్టెం దేవాలయంలో లక్ష తులసీ ఉత్సవం
బిజినేపల్లి, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): మండలంలోని వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం లక్ష తులసీ అర్చన ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సి.వి. శేషారెడ్డి దంపతుల కైంకర్యంతో వట్టెం వెంకన్న సన్నిధిలో జరుగుతున్న ఈ పవిత్రోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దేవస్థాన ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, నవీన్ స్వామి, తివారి అర్చక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా లక్ష తులసీ అర్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తులసి దళాలతో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపక ట్రస్టీ సందడి ప్రతాప్ రెడ్డి దంపతులు, వికాస తరంగిణి జిల్లా సమన్వయకర్త బండారు రాజశేఖర్, దుంపల్లి జనార్దన్ రెడ్డి, సుజాత, భరత్, చంద్రా రెడ్డి, గుబ్బ సత్యం తదితర ప్రముఖులు పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేశారు. ఉత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

