కియా కారులో కిడ్నాప్… రైతు వేదిక వెనుక చిత్రహింసలు!
జడ్చర్ల ఎస్సైపై దాడి కేసు నిందితుడి ఆగడాలు
నోరు విప్పితే చంపేస్తామంటూ బెదిరింపులు
భూత్పూర్, జనవరి 21 (మనఊరు ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకుల ఆగడాలు హద్దులు దాటుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలను కాపాడాల్సిన రాజకీయ నేతలే కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో జడ్చర్ల ఎస్సైపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతి రెడ్డి కలిసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దారుణంగా దాడి చేశారన్న ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. బాధితుడు వేంకటేష్ గౌడ్ భూత్పూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఘటన వివరాలు ఇవే…
భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన వేంకటేష్ గౌడ్‌ను మంగళవారం మధ్యాహ్నం భూత్పూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు నుంచి బలవంతంగా కియా కారులో ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. అనంతరం భూత్పూర్ రైతు వేదిక వెనుక భాగానికి తీసుకెళ్లి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపించాడు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించి మరీ కొట్టినట్లు,
“పోలీస్ స్టేషన్‌కు వెళ్తే చంపేస్తాం”
అంటూ ప్రాణహానీ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్దిగట్ల గ్రామంలో సర్పంచ్ ఓటమికి తానే కారణమని ఆరోపిస్తూ దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.
పాత కేసులు… కొత్త దాడులు!
కే. శ్రీనివాస్ రెడ్డిపై గతంలోనే జడ్చర్ల ఎస్సైపై దాడి చేసిన కేసు నమోదై ఉండటం గమనార్హం. రాజకీయ అండతో ఏమీ జరగదన్న ధీమాతోనే మరోసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీలపై వరుస దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇలాంటి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని సమాచారం.



