రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ
కల్వకుర్తిలో పోలీసుల అవగాహన ర్యాలీ
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
కల్వకుర్తి, జనవరి 21 (మనఊరు ప్రతినిధి): జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణ కేంద్రంలో రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ కల్వకుర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు శాఖ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. మహబూబ్‌నగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, కల్వకుర్తి ప్రధాన రహదారి మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు సాగి తిరిగి మహబూబ్‌నగర్ చౌరస్తా వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, యువకులు, విద్యార్థులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీకి బైకర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక సీటులో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరిస్తే ఇద్దరికీ భద్రత ఉంటుందని తెలిపారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించి రోడ్డు భద్రత పాటించాలని కోరారు. ఇటీవల రహదారులపై ధాన్యం ఆరబోస్తున్న నేపథ్యంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మీ కోసం మీ కుటుంబ సభ్యులుఅమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఇంటివద్ద ఎదురు చూస్తుంటారని గుర్తుంచుకుని రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్సై మాధవ్ రెడ్డి, సెకండ్ ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








