న్యూ ఇయర్ వేడుకలతో మద్యం అమ్మకాల సునామీ

 న్యూ ఇయర్ వేడుకలతో మద్యం అమ్మకాల సునామీ

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఎక్సైజ్ ఆదాయం

హైదరాబాద్, అమరావతి, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు గతంలో ఎన్నడూ లేని రికార్డులను బద్దలుకొట్టాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖలకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వేడుకల సీజన్, మారుతున్న జీవనశైలి, యువతలో పెరుగుతున్న మద్యపాన ధోరణి ఇందుకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో డిసెంబర్ 2025 నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.5,102 కోట్లకు చేరాయి. గత డిసెంబర్ 2023లో మద్యం విక్రయాలు రూ.4,300 కోట్లుగా ఉండగా, ఈసారి భారీగా పెరిగాయి. ముఖ్యంగా డిసెంబర్ 30వ తేదీన ఒక్కరోజే రూ.375 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం 2025 సంవత్సరంలోనే అత్యధికంగా నమోదైంది. ఇక 2025 చివరి రోజు డిసెంబర్ 31న రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సాయంత్రం సమయానికే దాదాపు రూ.350 కోట్లకు పైగా ఆదాయం లభించింది. డిసెంబర్ చివరి రెండు రోజులు కలిపితే మద్యం అమ్మకాలు సుమారు రూ.750 కోట్ల వరకు చేరాయి. 2023, 2024 డిసెంబర్లతో పోలిస్తే ఈసారి రూ.1,300 కోట్లకు పైగా అదనపు అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఎక్సైజ్ శాఖ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, రాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చింది. కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడిందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా న్యూ ఇయర్ వేడుకలతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 31న ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.172 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే రోజున రూ.112 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడవగా, ఈసారి రూ.60 కోట్ల మేర అధికంగా విక్రయాలు నమోదయ్యాయి. జనవరి 15 వరకు కూడా మద్యం, బీరు అమ్మకాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభంలోనూ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. వేడుకల సీజన్, మార్కెట్ డిమాండ్, వినియోగదారుల సంఖ్య పెరగడం వంటి అంశాలు ఈ వృద్ధికి కారణమని ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన ఈ రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చినట్లు అధికారులు వెల్లడించారు.

Previous Post Next Post