అంగన్వాడి సెంటర్ పరిశీలించిన సర్పంచ్ గీతారాణి
మౌలిక వసతుల కల్పనకు హామీ
నవాబుపేట, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని 3/5 అంగన్వాడి సెంటర్‌ను గ్రామ సర్పంచ్ గీతారాణి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్‌లో నెలకొన్న పలు సమస్యలను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంగన్వాడి సెంటర్‌లో టాయిలెట్స్ సౌకర్యం లేకపోవడం, మినీ వాటర్ ట్యాంక్ చుట్టూ కంపచెట్లు పెరిగి ఇబ్బందిగా మారడం, అలాగే భవనంలో కరెంటు సదుపాయం లేమి వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడకుండా వెంటనే మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ గీతారాణి హామీ ఇచ్చారు. అంగన్వాడి కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని, ముఖ్యంగా చిన్నారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
