రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
ఉప్పరిపల్లి–లక్ష్మాపూర్ రహదారి సమస్యపై అమరేందర్‌రెడ్డి పరిశీలన
అచ్చంపేట, జనవరి 17 (మనఊరు ప్రతినిధి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్‌రెడ్డి కోరారు. శనివారం ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి నుంచి లక్ష్మాపూర్‌కు వెళ్లే రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేఎల్‌ఐ కాలువ ముగియడంతో కాలువలోని నీరు రహదారిపైకి పారుతోందని తెలిపారు. పిచ్చి మొక్కలు, జమ్ము విపరీతంగా పెరిగి రోడ్డును పూర్తిగా కమ్మేయడంతో రహదారి బురదమయంగా మారిందన్నారు. దీంతో అటువైపు పొలాలు ఉన్న రైతులు నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పండించిన పంటను ఇళ్లకు లేదా మార్కెట్‌కు తరలించేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని, ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణించాల్సి వస్తోందన్నారు. సమస్యపై ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేయగా వారు అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారని తెలిపారు. పంచాయతీ రాజ్ అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉప్పరిపల్లి సర్పంచు బొజ్జ గీత, అమరేందర్‌రెడ్డి, గ్రామ రైతులు, ప్రజలు అధికారులను కోరారు.
