పుష్య మాస చతుర్దశిన శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు
నంది వడ్డేమాన్‌లో శాస్త్రోక్తంగా శనిగ్రహ దోష నివారణ పూజలు
బిజినేపల్లి, జనవరి 17 (మనఊరు ప్రతినిధి): శ్రీ విశ్వవాసు సంవత్సరం పుష్య మాసం కృష్ణపక్షం అమావాస్యకు ముందురోజైన చతుర్దశి శనివారం సందర్భంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనిగ్రహ దోష నివారణకు భక్తులచే శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా తిలతైల అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, శనేశ్వర స్వామి జన్మ నక్షత్రం పుష్యమి కావడం వల్ల పుష్య మాసంలో స్వామివారిని కొలిచిన భక్తులకు అత్యధిక ఫలితం లభిస్తుందని తెలిపారు. జన్మరీత్యా, గోచారరీత్యా శనిగ్రహ దోష నివారణకు ప్రతి ఒక్కరు తమ శక్తిమేరకు శనేశ్వర స్వామిని పూజించాలని సూచించారు. పుష్య మాసం, పుష్యమి నక్షత్రం, అమావాస్య రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడం మరింత విశేష ఫలితాలను ఇస్తుందన్నారు. శనేశ్వర స్వామికి ఇష్టమైన నువ్వుల నూనె, నువ్వులు–బెల్లం, జమ్మి ఆకు, నల్లని వస్త్రాలు, నీలిరంగు జిల్లేడు పూలతో పూజలు చేసి దానాలు చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, ప్రత్యేక అర్చనలు, దీపారాధన నిర్వహించారు. నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. పరమశివుని పూలమాలలతో విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్, ప్రభాకరాచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమ మహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
