జీవితంలో జూనియర్ కళాశాల దశ కీలకం
వెనుకబడిన ప్రాంత విద్యార్థుల కోసం కళాశాల ఏర్పాటు చేశాం
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, కల్వకుర్తి, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): జీవితంలో జూనియర్ కళాశాల దశ ఎంతో ముఖ్యమైనదని, వెనుకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువుల అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని కసిరెడ్డి దుర్గారెడ్డి జూనియర్ కళాశాలలో 1995–97 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు 150 మందికి పైగా ఒకచోట చేరి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, అందుకే జూనియర్ కళాశాల స్థాపించానని తెలిపారు. వేలాది మంది విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలు, సందడితో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హుజూర్నగర్ సీఐ చరమంద రాజు, ఎస్‌పి రైటర్ అశోక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.




