పాలమూరుపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
జూరాల వద్ద బీఆర్ఎస్ నిరసన
అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ మంత్రులు
మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి
గద్వాల, మహబూబ్ నగర్, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): పాలమూరు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం జూరాల ప్రాజెక్టు వద్ద ఘాటైన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు డా. సి. లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, గద్వాల బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ మార్పుపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూరాల నుంచి శ్రీశైలంకు ప్రాజెక్టు సోర్స్ ఎందుకు మార్చామో అప్పుడే ప్రజలకు స్పష్టంగా వివరించామని గుర్తు చేశారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం మొదట 19 టీఎంసీలుగా ఉండగా, కాంగ్రెస్ పాలనలో దాన్ని 11 టీఎంసీలకు, అనంతరం 9 టీఎంసీలకు తగ్గించారని ఆరోపించారు. జూరాల వద్ద నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటంతో పాటు అక్కడి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపడితే భారీ ముంపు సమస్య తలెత్తేదని తెలిపారు. అందుకే అప్పట్లో ఇంజినీర్లతో విస్తృతంగా చర్చించి ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలంకు మార్చినట్లు వివరించారు. డెబ్బై టీఎంసీల నీటిని జూరాల నుంచి తరలించడం అసాధ్యమని, శ్రీశైలం వద్ద మాత్రం ఫిబ్రవరి, మార్చి నెలల వరకు కూడా నీటిని ఎత్తిపోసుకునే సౌలభ్యం ఉందని స్పష్టం చేశారు. కనీస సాంకేతిక అవగాహన లేకుండా కాంగ్రెస్ మంత్రులు ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రజాధనం వృథా చేసే విధంగా మారిందని, ఇప్పటికే మక్తల్ ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు ప్రాజెక్టు కింద రైతులకు నీళ్లు అందించవచ్చని చెప్పారు. కేసీఆర్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు దూరదృష్టితో అద్భుతమైన డిజైన్ రూపొందించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. సీఎం, ఇరిగేషన్ మంత్రి మాటలతో కాదు… ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయకపోతే జిల్లా ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.





