మీనంబరంలో భక్తిశ్రద్ధల మధ్య 101వ పల్లకి సేవ
మాస శివరాత్రి సందర్భంగా శ్రీ మహా గౌరీ పరుశవేధిశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
మీనంబరం, (మనఊరు ప్రతినిధి): మండలంలోని మీనంబరం వాగు సమీపంలోని శ్రీ మహా గౌరీ పరుశవేధిశ్వర స్వామి దేవాలయంలో 101వ పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు జరిపారు. గంగాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల సుధాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పల్లకి సేవ పూజలను నిర్వహించారు.
ఈ పుణ్యకార్యానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే భజన మండలి కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు ఉత్సవ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని దేవాలయ కమిటీ అధ్యక్షులు బి. గోపాల్ ముదిరాజ్ తెలిపారు.



