రేపాటి నుంచి పాలెం వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఈనెల 20 నుంచి 27 వరకు వైభవంగా ఉత్సవాలు
బిజినేపల్లి, జనవరి 18 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో అలువేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏట మాఘ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను జనవరి 20 నుంచి జనవరి 27వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి ఆదివారం చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా
జనవరి 20న (మొదటి రోజు) స్వామివారికి అభిషేకం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, యాగశాల ప్రవేశం, రక్షాబంధనం, హంసవాహన సేవ నిర్వహించడం జరిగింది. ఈనెల 21న నిత్యారాధన, బలిహరణం, ధ్వజారోహణం, గరుడ పొంగళి నివేదన, సంతానం లేని వారికి ప్రసాద వితరణ, హనుమంత వాహన సేవ జరగనుంది. అదే రోజు పాలెం పూర్వ విద్యార్థుల సేవా సమితి, చైతన్య కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో మండల స్థాయి భాగవత పద్య పఠన పోటీలు జరిగాయి. 22న నిత్య పూజలు, ప్రబంధ పారాయణం, లక్ష పుష్పార్చన, విద్యార్థులకు వేంకటేశ్వర స్వామి సుప్రభాత పోటీలు, గరుడ వాహన సేవ జరుగుతాయి. 23న అలమేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 24న వేంకటేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భజన పోటీలు, హోమం, పల్లకి సేవ జరగనుంది. 25న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, రథ హోమం, రథానికి కుంభ స్థాపన, రథోత్సవం (తేరు) వైభవంగా నిర్వహించారు.
జనవరి 26న ఉద్దాల మహోత్సవం ఆరంభం, బలహరణ, అశ్వవాహన సేవ జరగనుంది.
