రేషన్ దుకాణాల కొరత..
పేదల పాలిట శాపంగా మారిన చౌకధర బియ్యం
కిలో రూపాయి బియ్యానికి రూ.50 ఆటో చార్జీ
భువనగిరి, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): జిల్లాలో రేషన్ దుకాణాలు సరిపడా లేకపోవడంతో పేదలు, కూలీలు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కిలో రూపాయికే బియ్యం అందిస్తున్నా, దుకాణాలు దూరంగా ఉండటంతో వినియోగదారులు కిలోమీటర్ల దూరం నడిచి లేదా ఆటోల్లో వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా బియ్యం ధర కంటే రవాణా ఖర్చే ఎక్కువ అవుతుండటంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి రేషన్ తీసుకురావాలంటే ఆటో ఖర్చులకే రూ.50 నుంచి రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో చౌకధర బియ్యం ప్రయోజనం లేకుండా పోతోందని వినియోగదారులు వాపోతున్నారు.
సంఖ్యలు చెబుతున్న వాస్తవం
జిల్లాలో ప్రస్తుతం 515 రేషన్ దుకాణాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల 33 వేలకుపైగా కొత్త రేషన్ కార్డులు జారీ కావడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 24,87,575కు చేరింది. అయితే దీనికి అనుగుణంగా దుకాణాలు పెరగకపోవడంతో పాటు, 90 రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, గత రెండేళ్లుగా వాటి భర్తీ జరగకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు జోక్యంతో ఇటీవల రెండు మూడు ప్రాంతాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేయించినప్పటికీ, అవి జిల్లా వ్యాప్తంగా ఉన్న అవసరాలకు సరిపోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామాల్లో అవస్థలే అవస్థలు
సంస్థాన్ నారాయణపురం మండలం ఐదోనాల్ తండాలో ఇప్పటికీ చౌకధరల దుకాణం లేదు. గిరిజన కుటుంబాలు ఆరు కిలోమీటర్ల దూరంలోని కడీలబావితండాకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారు. అల్లందేవిచెర్వు గ్రామస్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని సర్వేల్ గ్రామానికి వెళ్లి సరకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆలేరు మండలం కందిగడ్డతండా పంచాయతీ ఏర్పడి ఏడున్నర సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు రేషన్ దుకాణం ఏర్పాటు కాలేదు. వినియోగదారులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గుండ్లగూడేనికి వెళ్లాల్సి వస్తోంది. బొమ్మలరామారం మండలం రాంలింగంపల్లి, మర్యాల, చీకటిమామిడి, బొమ్మలరామారం, తిమ్మాపూర్ గ్రామాల్లోనే దుకాణాలు ఉండటంతో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతినెలా ఇతర గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. అడ్డగూడూరు మండలం కొండంపేట గ్రామస్థులు ఐదు కిలోమీటర్ల దూరంలోని అజీంపేటకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజల డిమాండ్
జనాభా పెరిగిన గ్రామాలు, తండాలు, పంచాయతీల్లో వెంటనే కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న డీలర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రేషన్ కోసం పడుతున్న ఈ అవస్థలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
