సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకు నిర్వీర్యం?
రైతులు, చిరు వ్యాపారుల ఇబ్బందులపై ప్రశ్నించిన కవిత
సూర్యాపేట, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): సూర్యాపేట పట్టణ మార్కెట్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించి రైతులు, చిరు వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వాడకంలోకి ఎందుకు రాలేదో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ నిర్మించామని చెబుతున్నా నాణ్యత పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని రైతులు చెబుతున్నారని అన్నారు. మార్కెట్‌లో సరైన గాలి, వెలుతురు లేకపోవడంతో పాటు రీ సౌండ్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అలాగే ఫ్లాట్‌ఫాం ఎత్తు చాలా ఎక్కువగా ఉండటంతో, బయట మెట్ల నుంచి కూరగాయలు లోపలికి తీసుకెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారిందని తెలిపారు. మార్కెట్లో కూరగాయలు అమ్మేవారిలో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులే ఉండటంతో, ఈ ఎత్తైన మెట్లు వారికి మరింత సమస్యగా మారాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే చాలామంది వ్యాపారులు మార్కెట్ లోపలికి వెళ్లకుండా బయటనే కూరగాయలు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇంత లోపాలు ఉన్న ఈ మార్కెట్ కోసం రూ.50 కోట్లు, మరికొందరు రూ.36 కోట్లు ఖర్చు అయిందని చెబుతున్నారని, అయినా మూడేళ్లుగా ఉపయోగంలోకి రాకపోవడం దురదృష్టకరమని కవిత విమర్శించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీకి చెందినవారు కాగా, అధికార పార్టీ వేరే ఉండటంతో రాజకీయ కారణాల వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ మార్కెట్‌ను సత్వరమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రజాసమస్యలపైనే తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తోందని, అధికారులపై ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, చిన్నపాటి సమస్యలను పరిష్కరించి ఈ పెద్ద ప్రభుత్వ ఆస్తిని ప్రజల వినియోగంలోకి తేవాలని కవిత కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






