రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రామకోటి తొలి వర్ధంతి…
కుటుంబ సభ్యుల కన్నీటి నివాళులు
కల్వకుర్తి రూరల్, జనవరి 5 (మన ఊరు ప్రతినిధి): మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన రామకోటి గత సంవత్సరం జనవరి 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం తాండ్ర గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో తొలి వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకోటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భగవంతుడు రామకోటి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకోటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. రామకోటి అకాల మరణం తమ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న కుటుంబ సభ్యులు, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచిపోతాయని భావోద్వేగంగా తెలిపారు. గ్రామస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
