అచ్చంపేట మున్సిపల్ బరిలో కపిలవాయి చంద్రమోహన్ కుటుంబం
అచ్చంపేట, జనవరి 19 (మనఊరు ప్రతినిధి): మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో ఆశావహుల మధ్య చర్చ మొదలైంది. మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ఇంకా ముగియకపోయినా, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ వర్గాల్లో చురుకైన కదలికలు కనిపిస్తున్నాయి. ఇతర మున్సిపాలిటీల మాదిరిగానే అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కపిలవాయి చంద్రమోహన్ కుటుంబం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న చంద్రమోహన్‌తో ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. చంద్రమోహన్ గతంలో పులిజాల ఎంపీటీసీగా పనిచేయడంతో పాటు టెలిఫోన్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ డీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందారు. పట్టణ సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తికి అవకాశం కల్పిస్తే అచ్చంపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవినీతి ఆరోపణలు లేని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడికి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో కపిలవాయి చంద్రమోహన్ కుటుంబం ముందంజలో ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీసీ సామాజికవర్గంలో రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడి కుటుంబానికి అవకాశం దక్కితే పాలన మరింత సజావుగా సాగుతుందన్న ఆశాభావాన్ని పట్టణవాసులు వ్యక్తం చేస్తున్నారు.
