భూముల హక్కుల స్పష్టతే లక్ష్యం

 పట్టణ భూముల హక్కుల స్పష్టతే లక్ష్యం

జడ్చర్ల, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): నక్ష సర్వే ద్వారా పట్టణ భూముల యాజమాన్య హక్కులకు స్పష్టత ఏర్పడి, భూ వివాదాలు తగ్గడంతో పాటు పట్టణ అభివృద్ధి, ఆస్తి పన్నుల వసూళ్లు మరింత సమర్థవంతంగా సాగుతాయని మునిసిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత లక్ష్మినర్సింలు, కమిషనర్ లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నక్ష సర్వే జడ్చర్ల మున్సిపాలిటీలో ప్రారంభమైంది. నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో సర్వే చేపట్టారు. ఈ సర్వేను మున్సిపల్ కమిషనర్ జి. లక్ష్మ రెడ్డి, ఏడి సర్వేయర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు చైతన్య చౌహాన్, కుమ్మరి రాజు, మండల్ సర్వేయర్ వి. సాయి రామ్, మున్సిపల్ సిబ్బంది, నాలుగు సర్వేయర్ బృందాలు పాల్గొన్నారు. నక్ష సర్వే ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటి, ప్రతి ఆస్తిని సమగ్రంగా సర్వే చేసి, అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఆస్తి హద్దులను గుర్తించి, వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియతో పట్టణ ప్రాంతాల్లో భూమి యాజమాన్య హక్కులు స్పష్టత పొందడంతో పాటు, భూ వివాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే పట్టణ ప్రణాళిక మరింత సమర్థవంతంగా అమలవుతుందని, ఆస్తి పన్నుల వసూళ్లు పారదర్శకంగా జరుగుతాయని, ఆస్తుల రక్షణకు ఈ సర్వే ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో ఈ నక్ష సర్వే కార్యక్రమం మూడు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.

Previous Post Next Post