అన్నాసాగర్‌లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
విద్యార్థులకు బూట్లు, సాక్సులు అందించిన సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి
భూత్పూర్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి గ్రామ సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు చెన్నయ్య, నవీన్, కే. శ్రీనివాసులు, ఏ. శశిబాబు, ఏ. నాగేందర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి సమకూర్చిన నిధులతో ప్రాథమిక విద్యార్థులకు బూట్లు, సాక్సులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువు ద్వారానే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని నమ్మిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శమని తెలిపారు. ఆమె సేవలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఈ. శేఖర్, శశిబాబు, ఎండి. షాకీర్, మధుకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గుముడాల చక్రవర్తిగౌడ్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.








