రవీంద్రభారతిలో అవార్డు అందుకున్న బోయిన్పల్లి ఉపాధ్యాయురాలు

 సావిత్రిబాయి ఫూలే అవార్డు అందుకున్న బోయిన్ పల్లి హిందీ ఉపాధ్యాయురాలు రేణుక   

మిడ్జిల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి ఫూలే గారి 195వ జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వేదికగా మహిళా ఉపాధ్యాయినులకు సావిత్రిబాయి ఫూలే అవార్డులు ప్రదానం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో మన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయిన్ పల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న పి.జి. రేణుక గారికి సావిత్రిబాయి ఫూలే అవార్డు లభించడం గర్వకారణంగా నిలిచింది. విద్యారంగంలో ఆమె చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ మరియు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని మహిళా ఉపాధ్యాయినుల సేవలను ప్రశంసించారు. జిల్లా స్థాయిలో ఒక ఉపాధ్యాయురాలికి రాష్ట్రస్థాయి అవార్డు లభించడం పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


Previous Post Next Post