రోడ్డుప్రమాదాల నివారణే లక్ష్యం…
చెట్ల తొలగింపుతో రోడ్డు విస్తరణ
కల్వకుర్తి, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం నుంచి మెదక్‌పల్లి, ఖానాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా విస్తరించి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న చెట్లను గ్రామ సర్పంచ్ పసుల మల్లేష్ ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుకు అడ్డంగా పెరిగిన చెట్ల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మలుపుల వద్ద ప్రమాదాల ముప్పు పెరుగుతుండటంతో వాటిని నివారించేందుకు చెట్లను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామ సర్పంచిగా ప్రజల భద్రత తన బాధ్యత అని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి మంజుల, వార్డు సభ్యులు శేఖర్ గౌడ్, శ్రీశైలం గౌడ్, యాదయ్య, కేశవులు తదితరులు పాల్గొనగా, గ్రామస్తులు సర్పంచ్ చర్యలను అభినందించారు.
