పాలేం వెంకన్న ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు

 పాలేం వెంకన్న ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు

గోదాదేవి అమ్మవారికి శాస్త్రోక్త సేవలు.. భక్తులతో కిటకిట

బిజినేపల్లి, జనవరి 4 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అల్మేరల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజ చార్యులు తెలిపిన వివరాల ప్రకారం ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు తిరుప్పావై సేవా కాలం, పాశుర పఠనం, మహా మంగళారతి, ప్రత్యేక నైవేద్యాల సమర్పణ కార్యక్రమాలను తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు ఘనంగా చేపట్టారు. ఈ ప్రాంత భక్తులు గోదాదేవి అమ్మవారి కృపాకటాక్షాలు పొందుటకు ధనుర్మాస పూజలను నెలరోజుల పాటు చేయించుకోవడానికి రూ.501 రుసుముతో గోత్రనామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. భక్తుల పేరిట ప్రతిరోజు పూజలు నిర్వహించి, ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు ప్రత్యేక వేద ఆశీర్వచనం అందజేస్తామని ఆయన తెలిపారు. ధనుర్మాసం భక్తులకు సువర్ణ అవకాశమని, స్వామి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జయంత్ కుమార్, శుక్ల, అరవిందు, చక్రపాణి, ఆలయ సిబ్బంది ఆర్. శివకుమార్, బాబయ్య, ఈ ప్రాంత భక్తులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ధార్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.





Previous Post Next Post