జడ్చర్లలో అల్ట్రా జోలం కలకలం…
ముగ్గురు అరెస్ట్,
240 గ్రాముల నిషేధిత మత్తు పదార్థం స్వాధీనం
జడ్చర్ల, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పరిధిలో గంజాయి, అల్ట్రా జోలం వంటి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా 240 గ్రాముల నిషేధిత అల్ట్రా జోలం, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు జడ్చర్ల ఎక్సైజ్ సర్కిల్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారిపై గల నక్కల బండ తండా వద్ద అక్రమంగా అల్ట్రా జోలం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొండయ్య నాయక్ (కోయిలకొండ మండలం, పెద్ద తండా గ్రామం)ను తనిఖీ చేయగా అతని వద్ద 240 గ్రాముల అల్ట్రా జోలం లభ్యమైంది. అతని విచారణలో అందిన సమాచారం మేరకు, ఈ మత్తు పదార్థాన్ని సరఫరా చేసిన దమ్మెగూడకు చెందిన రాంసాగర్, నాగరాజులను హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 85 గ్రాముల అల్ట్రా జోలం, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరంతా ఒక్క గ్రాము అల్ట్రా జోలాన్ని రూ.1,000 చొప్పున మహబూబ్‌నగర్ లోకల్‌తో పాటు వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు కార్తీక్ రెడ్డి, నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, మురళీ మోహన్, కానిస్టేబుళ్లు సిద్ధార్థ్, అనిల్ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. నిషేధిత అల్ట్రా జోలం లేదా గంజాయి విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీఐ విప్లవ రెడ్డి హెచ్చరించారు.
