రఘుపతిపేటను మండల కేంద్రంగా ప్రకటించాలి

 రఘుపతిపేటను మండల కేంద్రంగా ప్రకటించాలి

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి 

సిపిఐ నియోజకవర్గ ఇంచార్జి పరశురాములు

కల్వకుర్తి రూరల్, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం కల్వకుర్తిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన రఘుపతిపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో గతంలో రిలే నిరాహార దీక్షలు, పాలమూరు చౌరస్తాలో రాస్తారోకోలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడులు నిర్వహించినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ అంశాన్ని తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తాను గెలిస్తే రఘుపతిపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తరువాత ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. ఈ ప్రాంత వాసైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రఘుపతిపేట గ్రామాన్ని మండల కేంద్రంగా, కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు డాక్టర్ శ్రీనివాస్, ధార దాసు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post