ఘనంగా ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి రథోత్సవం
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కల్వకుర్తి, ఉరుకొండ, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలోని ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ ఆలయంలో కొలువైన పబ్బతి ఆంజనేయ స్వామికి ఎక్కడా లేని విధంగా సింధూర లేపనం చేయకుండా ప్రతిరోజూ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతి శని, మంగళవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి, వ్రతాలు చేయడానికి తరలివస్తుంటారు. రథోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయనే సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఊరుకొండ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంమని, ఇక్కడి సంప్రదాయాలు, ఉత్సవాలు తరతరాలుగా ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

