వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనం
భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ, అగ్నిగుండ ప్రవేశం
కల్వకుర్తి, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మాఘ శుద్ధ విదియను పురస్కరించుకొని వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజామున అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, అనంతరం కుంకుమార్చన చేపట్టారు. భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయ ప్రాంగణం భక్తితో మార్మోగింది. ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అలంకరించి పట్టణ వీధుల్లో భక్తులు జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. తదనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించగా, అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం భక్తి పారవశ్యంతో సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు దంపతులు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తుల కోసం లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించి, పదిమంది మహిళా భక్తులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వనిత క్లబ్, అవోప సభ్యులు పాల్గొనగా, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసా శేఖర్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ చిగుళ్లపల్లి శ్రీధర్, పట్టణ కార్యదర్శి సంబు ముత్యాలు, గుబ్బ ఈశ్వరయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందేరవి, అప్పాయిపల్లి శ్రీనివాస్, కల్మిచర్ల గోపాల్, కల్మిచర్ల రాఘవేందర్, శోభన్ బాబు, కల్వ ఆంజనేయులు, దాచేపల్లి మనోహర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు బాదం హరీష్, బాదం సాయి లక్ష్మి, గోవిందు మౌనిక, గోవిందు సంతోష్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



