నవాబుపేట గ్రామ సర్పంచ్ కు సేవా అవార్డు
నవాబుపేట, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): పూవు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా నవాబుపేట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అతికొద్ది కాలంలోనే గ్రామ సర్పంచ్ గీతారాణి కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయికి చేరాయి. హైదరాబాద్ కు చెందిన బుస్సా ఫిలిం ఫోకస్ విజేత అవార్డ్స్ వారి నుండి విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన జె కె ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న వినూత్నమైన సేవా కార్యక్రమాలను గుర్తించిన బిపిపివిఎ వారు గీతారాణి సుధాకర్ చారి దంపతులను భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన సేవా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ కు ఆహ్వానించి ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ చేతుల మీదుగా వారికి విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రధానం చేశారు.(జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతారాణి కుటుంబ సభ్యులు వినూత్నమైన సామాజిక సేవ కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహిస్తూ మండల ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారు. వారు జె కె ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు వ్రాయడానికి వీలు లేనంత స్థాయిలో చేతాడంతకు చేరాయి. అందువల్లే గ్రామ ప్రజలు ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆదరించి ఆ కుటుంబానికి చెందిన గీతారాణిని గ్రామ సర్పంచిగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర, ఫిలిం డైరెక్టర్ డాక్టర్ కస్తూరి శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


