అంగరంగ వైభవంగా కనుల పండుగగా పాలెం వెంకన్న రథోత్సవం
బిజినేపల్లి, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అల్మేరల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి (పాలెం వెంకన్న) బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా నిర్వహించిన రథోత్సవం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజామున స్వామివారి ఉత్సవమూర్తులతో ఆలయ ప్రాంగణం నుండి పాలెం ప్రధాన వీధుల గుండా తేరు ఉత్సవాన్ని గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ముడుపులు చెల్లించేందుకు భక్తులు తులాభార కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కీర్తిని ఆలపిస్తూ ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేద మూర్తులైన బ్రాహ్మణులు ప్రత్యేక హోమ పూజలను నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ జున్నా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి, కార్యనిర్వహణ అధికారి సిహెచ్ రంగారావు, ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, మాజీ మండలాధ్యక్షులు పి. శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
