సావిత్రి బాయి పూలే జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం

 సావిత్రి బాయి పూలే జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం

రాణిపేట సర్పంచ్ కర్నేకోట మాధవిమల్లేష్ 

మిడ్జిల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): సావిత్రి బాయి పూలే జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని సర్పంచ్ కర్నేకోట మాధవిమల్లేష్ అన్నారు. మండలంలోని రాణిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే మహిళా విద్య కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయురాలని పేర్కొన్నారు. ఆమె వేసిన బాటలోనే నేటి సమాజం ముందుకు సాగుతోందని అన్నారు. చదువే నిజమైన ఆయుధమని, విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు విద్యను తమ భవిష్యత్తు నిర్మాణానికి బలమైన సాధనంగా మలుచుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనలో తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య ద్వారా సమానత్వం, సాధికారత సాధ్యమని ఆమె తన జీవితంతో నిరూపించారని తెలిపారు. విద్యార్థులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదివి సమాజంలో ఉన్నత స్థానం సాధించాలని సూచించారు. సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతికి జీవితాంతం అంకితమై పనిచేసిన మహనీయురాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మోహన్ రావు, ఉప సర్పంచ్ పర్విన్ బేగం, వాడు సభ్యులు విజయలక్ష్మి, మసూద్, ఏఎంసీ చైర్మన్ వసంత, ఉపాధ్యాయులు ప్రభావతి, నాయకులు జగన్, మహబూబ్, హమ్మద్ హుస్సేన్, బాస్మియా, ఖాదర్, మల్లేష్, ఆశ కార్యకర్దితలు, తరులు పాల్గొన్నారు. 

Previous Post Next Post