జ్ఞాన సరస్వతి దేవాలయంలో వైభవంగా గోవృషభ కళ్యాణం
అమ్మవారికి అభిషేకాలు, నవగ్రహ హోమం, పల్లకి సేవ
నాగర్ కర్నూల్, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు దేవాలయంలో గోవు–వృషభ కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించినట్లు దేవాలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్, వేద అర్చకులు ప్రవీణాచార్యులు, గోపాలాచార్యులు ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన మిడిదొడ్డి పాండురంగయ్య–వరలక్ష్మి దంపతులచే గోవృషభ కళ్యాణం వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ దేవతా స్వరూపమే గోవు అని, గోవృషభ కళ్యాణం నిర్వహించడంతో పాడిపంటలు, భోగభాగ్యాలు, అష్టాఐశ్వర్యాలు, సర్వ కార్యసిద్ధి లభిస్తాయని తెలిపారు. ఈ కళ్యాణాన్ని దర్శించిన, పాల్గొన్న భక్తులకు విశేష పుణ్యఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గణపతి పూజ, నవగ్రహ పూజలతో పాటు నవగ్రహ హోమం నిర్వహించగా, జన్మనిత్య, గోచార రీత్యా గ్రహాలు శాంతించి విశేష ఫలితాలు లభిస్తాయని అర్చకులు వివరించారు. జ్ఞాన సరస్వతి పారాయణ కమిటీ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, లింగాష్టకం భక్తులు సామూహికంగా పఠనం చేశారు. ఆలయ ఆవరణలో అమ్మవారికి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని సామూహికంగా పంపిణీ చేశారు. శ్రీశైలం వెళ్తున్న శివదీక్ష స్వాములకు ప్రత్యేకంగా అన్నప్రసాదం అందజేశారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు బుధవారం నాడు గాయత్రి హోమం, వివిధ పాఠశాలల విద్యార్థులచే అమ్మవారికి సామూహిక అభిషేకాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు దొడ్ల ఇందుమతి, బాలస్వామి, మిడిదొడ్డి శివశంకర్, లగిశెట్టి వరలక్ష్మి, సోమశిల శారదమ్మ, రవికుమార్, భూపాల్ రెడ్డి, అలంపల్లి శివకుమార్, జటప్రోలు నవీన్ కుమార్‌లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





