రామాలయంలో శాస్త్రోక్తంగా సూర్యనారాయణ హోమం,అభిషేక పూజలు...
రథసప్తమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సూర్యారాధన
నాగర్ కర్నూల్, జనవరి 25 మనఊరు ప్రతినిధి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య దేవునికి అభిషేక పూజలు, సూర్యనారాయణ హోమాన్ని శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. సూర్యనారాయణ హోమాన్ని ఆలయ అర్చకులు కందాడై శ్రీనివాసాచార్యులు ప్రత్యేకంగా నిర్వహించారు. భక్తులు సామూహికంగా పాల్గొని సూర్యనారాయణ స్వామికి విశేష ద్రవ్యాలతో అభిషేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు రామాలయ అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, గొల్ల రాములు, టి. మల్లేష్, మన్యపు రెడ్డి, రమాదేవి, శారద, శివ, పాండు, నందకిషోర్‌తో పాటు మహిళలు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




