ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

 ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల బాధ్యత అపారం

 జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జడ్చర్ల జర్నలిస్టు కాలనీలో నిర్వహించిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన కుమారుడు జర్నలిజంపై వ్యాసం రాస్తూ ‘జర్నలిజం అంటే ఏమిటి?’ అని అడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడమే జర్నలిజమని వివరించానన్నారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల గొంతుకగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టు కాలనీలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జడ్చర్ల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ముడా నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. బైపాస్ రోడ్డుకు డీపీఆర్ సిద్ధం చేసేందుకు వెడ్డింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యాభివృద్ధితోనే నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధిలో జర్నలిస్టులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెనకడుగు వేయబోనన్నారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ జర్నలిస్టు కాలనీకి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ  కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుల్తాన్, ఉపాధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి మల్లేష్, కోశాధికారి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు శ్రీను, సంతోషి, సీనియర్ జర్నలిస్టులు శశిధర్ రెడ్డి, వెంకటయ్య, టి.శేఖర్, శ్రీధర్, నరేందర్, సురేందర్, రమేష్, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.









Previous Post Next Post