అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన సాధ్యం
కార్వంగలో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరం విజయవంతం
నాగర్ కర్నూలు, జనవరి 8 (మనఊరు ప్రతినిధి):
ప్రజల్లో అవగాహన పెంచి, సకాలంలో పరీక్షలు-చికిత్సలు అందిస్తే క్షయ వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చని జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫీక్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కార్వంగా గ్రామంలో గురువారం భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఫీక్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. శిబిరానికి హాజరైన క్షయ వ్యాధి అనుమానితుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించారు. క్షయ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, మందులను సకాలంలో పూర్తిగా వినియోగిస్తే త్వరగా నయం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీబీ రిపోర్టింగ్ అధికారి మినహాజ్, టీవీ టిబి సూపర్వైజర్ శ్రీనివాసులు, భవిష్య భారత్ మేనేజర్ సజ్జద్ అలీ, ఎంఎల్‌హెచ్‌పి అలివేలు, ఏఎన్ఎం ఇందిర, రేడియోగ్రాఫర్లు ఆమన్, చందు, తదితరులు పాల్గొన్నారు.

