రోడ్డు భద్రతే ప్రతి పౌరుడి బాధ్యత
కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి
సీబీఎం డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
కల్వకుర్తి, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని సీబీఎం డిగ్రీ కళాశాలలోని రెసిడెన్షియల్ విద్యార్థులకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) అశోక్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్‌బెల్ట్ వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని విద్యార్థులకు వివరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్, ఎంవీఐ అశోక్, పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


