టెట్ మినహాయింపు కోరుతూ ఉపాధ్యాయుల నిరసన
నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆందోళన
నాగర్ కర్నూల్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా నియమించిన ఉపాధ్యాయులను టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష విధానం నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా అధ్యక్షుడు కే. శ్రీధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలోనే అన్ని అర్హతలు కలిగి ప్రభుత్వం ఎంపిక చేసి నియమించిన ఉపాధ్యాయులపై మళ్లీ టెట్ నిబంధనలు విధించడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే టెట్ మినహాయింపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాక్టో ఇచ్చిన పిలుపు మేరకు నాగర్ కర్నూల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గుడిపల్లి, బల్మూర్, వెల్టూర్, తెలకపల్లి, బిజినపల్లి, తాడూరు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లోని వివిధ పాఠశాలల్లో విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రమేష్, విష్ణు, చంద్రశేఖర్, ఆంజనేయులు, సంతోష్, ప్రకాష్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

