ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

 ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

  సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి

కల్వకుర్తి రూరల్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తన శాయశక్తులా పనిచేస్తానని సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని తాండ్ర గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన వనరులను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఐదేళ్ల సర్పంచ్ పదవీ కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే సొంత నిధులను వినియోగించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ గ్రామస్తులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ గ్రామ సభలో పారిశుధ్య కార్యక్రమాలు, గ్రామంలోని మురుగునీటి గుంతలను పూడ్చడం, రోడ్లపై గుంతలను మొరం సహాయంతో పూడ్చటం, తాగునీటి సమస్య, వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలు, బాల్య వివాహాలపై అవగాహన వంటి అంశాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో అదనపు నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని గ్రామ నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎట్టి ఈదన్న, గ్రామ కార్యదర్శి శాయిలీల, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని తమ సమస్యలు, సూచనలు తెలియజేశారు.







Previous Post Next Post