ఇక ఇంటి వద్ద నుంచే పోలీస్ ఫిర్యాదులు
ప్రజలకు చేరువైన తెలంగాణ పోలీస్ సంస్కరణ
హైదరాబాద్, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించింది. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల ఇంటికే పోలీస్ సిబ్బంది వెళ్లి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటగా మారనుందని అధికారులు తెలిపారు. ఫోన్ కాల్, ఆన్‌లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధానం అమలులోకి రావడం ద్వారా ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గృహహింస, మోసం, వేధింపులు వంటి సున్నితమైన కేసుల్లో బాధితులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఇదిలా ఉండగా, సైబర్ నేర బాధితుల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించిన ‘సీ-మిత్ర’ సేవ కూడా మంచి ఫలితాలు ఇస్తోందని అధికారులు తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వారు తక్షణమే ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఈ సేవ ద్వారా లభిస్తోందని పేర్కొన్నారు.
