రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ నియామకంతో ...
నాణ్యత పెరగనున్న మూత్ర,రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలు...
నాగర్ కర్నూల్, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వం తాజాగా ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టింగ్ ప్రక్రియను పూర్తిచేసింది. 2024 నవంబర్‌లో మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి రాత పరీక్ష నిర్వహించగా, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం గతేడాది నవంబర్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ ఎంపికలో భాగంగా జిల్లా మెడికల్ కళాశాలకు 33 మంది ల్యాబ్ టెక్నీషియన్లు నియామకం పొందారు. వీరికి మంగళవారం ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం అందరూ విధుల్లో చేరి రిపోర్ట్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ల నియామకంతో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలలో మూత్ర, రక్త పరీక్షలు తదితర ల్యాబ్ పరీక్షల నివేదికల ఆలస్యం తగ్గి, రోగులకు వేగవంతమైన వైద్య సేవలు అందనున్నాయని అధికారులు తెలిపారు.


