జంగమయ్యపల్లిలో ఘర్షణ.. కేసుల పరంపర
పాత కక్షలే కారణమా..?
రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తత
నవాబుపేట, జనవరి 22 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఘర్షణ చిలికి గాలివానలా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం జంగమయ్యపల్లికి చెందిన కారె అశోక్ అనే యువకుడిపై శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గురువారం అశోక్ తండ్రి పార్వతయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే గ్రామానికి చెందిన పరిగి వీరేశం, శైలజ దంపతులతో పాటు వీరేశం సోదరుడు శ్రీశైలం, ఆయన భార్య ద్వారక, వీరేశం కుమారుడు శివకుమార్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కారె అశోక్ బీరప్ప దేవుడిని చేసే సమయంలో విన్యాసాలకు ఉపయోగించే కత్తిని తీసుకుని వీరేశం ఇంటి వద్దకు వెళ్లి వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఈ అశోక్ చేతిలో కత్తిని లాక్కున్న వీరేశం కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో వీరేశం, శ్రీశైలం సోదరులకు రక్త గాయాలు కాగా, కారె అశోక్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘర్షణతో గ్రామంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, “గాలికి పోయే కంప రెండు కుటుంబాల కాళ్లకు చుట్టుకున్నట్లైంది” అని గ్రామస్తులు చర్చించుకోవడం. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గ్రామంలో పర్యవేక్షణ పెంచారు.
