అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కనుమ పతంగి వైభవం
రంగనాయక స్వామి గుట్టపై తిలకంలా దర్శనమిచ్చిన మహా పతంగి తోక
కనీసం 50 మీటర్ల పొడవుతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన దృశ్యం
జడ్చర్ల, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): కనుమ పండుగ సందర్భంగా రంగనాయక స్వామి గుట్టపై ఎగురుతున్న భారీ పతంగి అందరి దృష్టిని ఆకర్షించింది. అంత పెద్ద తోకతో పతంగిని చూడడం అసాధ్యమేనని భావించినా, పంచభూతాల అనుకూలతతో పాటు మనుషుల సంకల్పబలంతో అది సుసాధ్యమైంది. కనీసం 50 మీటర్ల పొడవున్న పతంగి తోక గుట్టపై తిలకం లాగా కనిపించడంతో పండుగకు ప్రత్యేక శోభ చేకూరింది. పతంగి తోక మనకు తోరణంలా అనిపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఒక కాయ కావాలన్నా తీగ అవసరమయ్యే పరిస్థితుల్లో, ఈ కలియుగంలో ఇంత పెద్ద చైన్ సిస్టంతో పతంగిని ఎగురవేయడం అదృష్టం కలిసొచ్చినప్పుడే సాధ్యమవుతుందని పెద్దలు వ్యాఖ్యానించారు. ఈ విశేష దృశ్యాన్ని చూడడానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. సంప్రదాయాలు, ఐక్యత, సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచిన ఈ కనుమ పతంగి వేడుక అందరికీ మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. ఈ సందర్భంగా నిర్వాహకులు, గ్రామ పెద్దలు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
