ఆటీజం పెరుగుదల ఆందోళనకరం
పర్యావరణ విషతుల్యత, గట్ ఆరోగ్యం కీలకం
డాక్టర్. చంద్రశేఖర్ తొడుపునూరి
నాగర్ కర్నూల్, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): గత నాలుగు నుంచి ఐదు దశాబ్దాల కాలంలో ఆటీజం కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, ప్రస్తుతం పుట్టే ప్రతి 50 మంది పిల్లల్లో ఒకరు ఆటీజంతో బాధపడుతున్నారని రెస్ప్లేస్ (రేస్ ప్లస్) ఆటిజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రెండు దశాబ్దాల్లో పుట్టే ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఆటీజం వచ్చే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం, గట్ ఆరోగ్యం దెబ్బతినడం ఆటీజం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) 2005లో నిర్వహించిన బాడీ బర్డెన్ స్టడీతో పాటు, 2025లో విడుదలైన రెండు దశాబ్దాల పరిశోధనల ఆధారంగా రూపొందించిన మేక్ అమెరికా హెల్తీ అగైన్ (మహా) గెజిట్ నివేదికలను ఆయన ప్రస్తావించారు. ఈ పరిశోధనల ప్రకారం వ్యవసాయంలో వినియోగించే రసాయనాలు, పరిశ్రమల వల్ల తాగునీటిలో కలిగే కాలుష్యం, నాన్‌స్టిక్ వంట పాత్రల నుంచి విడుదలయ్యే రసాయనాలు, ఆహార పరిరక్షణ కోసం ఉపయోగించే కెమికల్స్ శరీరంలో క్రమంగా చేరి (బయో అక్యుమిలేషన్) గర్భస్థ శిశువుల నాడీ వ్యవస్థ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ విష పదార్థాలు శిశువుల గట్ మైక్రో బయోమ్‌ను దెబ్బతీసి, మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, నాడీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రారంభ దశలోనే రసాయనాల ప్రభావాన్ని తగ్గించి, గట్ మైక్రో బయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే భవిష్యత్ తరాల్లో ఆటీజం ప్రబల్యతను తగ్గించవచ్చని డా. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు పర్యావరణ కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టి, ఆహారం, నీటి భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. అటిస్టిక్ పిల్లల్లో మలబద్ధకం, ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, గట్‌లోని బ్యాక్టీరియా మెదడుకు సంకేతాలు పంపడం ద్వారా నిద్ర, అభ్యాసం, ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలిపారు. దీనికి పరిష్కారంగా గట్, బ్రెయిన్ యాక్సిస్‌ను పరిరక్షించే ఫికల్ మైక్రో బయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎఫ్‌టీఎం) చికిత్సను రేస్ ప్లస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిందన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆటీజం పిల్లలకు ఎఫ్‌టీఎం చికిత్స అందిస్తున్న ఏకైక సంస్థ తమదేనని, దేశంలో తొలి స్టూల్ బ్యాంకును కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చికిత్స ద్వారా ఆటీజం లక్షణాల్లో 30 నుంచి 40 శాతం మెరుగుదల కనిపిస్తోందని, నిర్దిష్ట మెదడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పరిశోధన పూర్తైతే 70 నుంచి 80 శాతం వరకు రికవరీ సాధ్యమవుతుందని అంచనా వేశారు. ఈ పరిశోధనకు సుమారు మరో దశాబ్దం సమయం పడుతుందని తెలిపారు. ఆటీజం కారణాలు, నివారణ మార్గాలు, ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని, గర్భధారణకు ముందే ఆటీజాన్ని అరికట్టవచ్చన్న విషయాన్ని ప్రతి గ్రామానికి చేరవేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని రేస్ ప్లస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్ణయించిందన్నారు. ఈ మేరకు సంస్థ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పి. లాలూ ప్రసాద్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్‌కు మెమోరండం అందజేశారు.
