సైకిల్ దొంగతనం బాధతో కన్నీరు పెట్టిన విద్యార్థినికి ఎస్సై మానవత్వం
పాన్‌గల్, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన వట్టెల అక్షయ (8వ తరగతి) విద్యార్థినిపై ఎస్సై చూపిన మానవత్వం అందరి మనసులను కదిలించింది. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న అక్షయ ప్రతిరోజూ తన గ్రామం నుంచి సైకిల్‌పై పాన్‌గల్‌కు వచ్చి వెళ్లేది. డిసెంబర్ 30న పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రతిరోజూ సైకిల్ పార్క్ చేసే చోటే సైకిల్ నిలిపి తరగతులకు వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ సైకిల్ కనిపించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, గుర్తు తెలియని వ్యక్తులు తన సైకిల్ దొంగిలించారని ఎస్సైకి ఫిర్యాదు చేసింది. విద్యార్థిని కన్నీళ్లు చూసి చలించిన ఎస్సై శ్రీనివాస్ ఆమెకు సైకిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తన సొంత ఖర్చులతో కొత్త సైకిల్ కొనుగోలు చేసి, బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో గోప్లాపూర్ గ్రామ సర్పంచ్ రాజేందర్ నాయక్, నాయకులు పుల్లారావు సమక్షంలో విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ సభ్యులు, స్థానికులు ఎస్సై శ్రీనివాస్ చూపిన మానవత్వాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.
