నేడు బాలన్‌పల్లి సూర్య దేవాలయంలో ఘనంగా రథసప్తమి ప్రత్యేక పూజలు
తాడూరు, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): మండలంలోని బాలన్‌పల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దేవాలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రోజున ఉదయం నుండి సూర్య దేవునికి ప్రత్యేక అభిషేకాలు, నవగ్రహ హోమాలు, సూర్య నమస్కార పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో దయానంద గిరి స్వామి ఆశ్రమాధిపతి భూమానంద స్వామి పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం రోజున కూడా ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై సూర్య దేవుని దర్శించుకుని పుణ్యఫలం పొందాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో గ్రామ పెద్దలు, యువకులు, దేవాలయ సేవకులు విశేషంగా సహకరించారని తెలిపారు.
