నాగర్‌కర్నూల్‌లో ఘనంగా యువత శివదీక్షలు
మహాశివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మండల శివమాల స్వీకరణ
శివమాలలతో మార్మోగిన నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన శివభక్తులు, యువత మండల శివదీక్ష మాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. యువత పెద్ద ఎత్తున శివదీక్షలు స్వీకరించడంతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మల్లికార్జున సన్నిధానం నుంచి గురుస్వాములు రాంబాబు, విజయకుమార్, చంద్రశేఖర్, శివ, శంకర్, లోకేష్, రామచందర్ ఆశీస్సులతో, అలాగే శ్రీ నీలకంఠ సన్నిధానం నుంచి గురుస్వాములు కొండకింది మాధవరెడ్డి, మూర్తి, సతీష్ చారి ఆధ్వర్యంలో యువత శివమాల దీక్ష స్వీకరించారు. దీక్ష స్వీకరించిన భక్తులు మండల రోజుల పాటు నియమ నిష్ఠలతో శివపూజలు, అభిషేకాలు, జపధ్యానాలతో దీక్షను నిర్వహిస్తున్నట్లు శివస్వాములు తెలిపారు. యువత శివమాల స్వీకరణతో పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. ఇంకా ఆసక్తి గల భక్తులు మండల, అర్థమండల దీక్షలు కూడా స్వీకరించవచ్చని గురుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు శివస్వాములు, భక్తులు పాల్గొన్నారు.

