మహిళా సంఘాలపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు

 స్త్రీనిధి రుణబకాయిదారులపై రెవెన్యూ రికవరీ చట్టం

అప్పు కట్టకపోతే ఆస్తుల జప్తు 

 సంఘ సభ్యులకూ బాధ్యత

బిజినేపల్లి, జనవరి 6 (మనఊరు ప్రతినిధి): స్త్రీనిధి రుణబకాయిదారులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు స్త్రీనిధి మేనేజర్ విక్రమ్ కుమార్ తెలిపారు. మంగళవారం బిజినేపల్లి మండల మహిళ సమాఖ్యలో మహిళా సంఘ సభ్యులకు రెవెన్యూ రికవరీ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాల్లో కొందరు సభ్యుల నిర్లక్ష్యం కారణంగా మొండి బకాయిలు పెరుగుతున్నాయని అన్నారు. దీంతో అర్హులైన పలువురు సభ్యులు రుణాలు పొందలేని పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రుణ వసూలు కోసం రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

రుణం చెల్లించని సభ్యుల ఆస్తులను జప్తు చేసి రుణానికి జమ చేసే అధికారం అధికార యంత్రాంగానికి ఉంటుందని చెప్పారు. ఒకవేళ సంబంధిత సభ్యురాలికి ఆస్తులు లేనిపక్షంలో, సంబంధిత సంఘంలోని ఇతర సభ్యులు బాధ్యత వహించి బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సంఘ సభ్యులు పరస్పర అవగాహనతో వ్యవహరించి బకాయిలు లేకుండా చూసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో సెర్ప్, స్త్రీనిధి అధికారులు రెవెన్యూ రికవరీ చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు, వివోఏలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Previous Post Next Post