మార్చాల ఉన్నత పాఠశాలలో పిచ్చి మొక్కల ముప్పు
నిర్లక్ష్యంగా ఉపాధ్యాయులు, ఏఎంసీ కమిటీ
విద్యార్థులకు పాముల బెడద భయం…
అపరిశుభ్ర మూత్రశాలలతో విద్యార్థుల అవస్థలు
కల్వకుర్తి రూరల్, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): మండలంలోని మార్చాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదుల వెనుకభాగాల్లో, పాఠశాల ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండటంతో విషపూరిత పాములు చొరబడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలోని మూత్రశాలలు అపరిశుభ్రంగా మారి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు మూత్రశాలలను ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. పిచ్చి మొక్కల మధ్య విద్యార్థులు సంచరించాల్సి రావడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బృందం, ఏఎంసీ నిర్వహణ కమిటీ సభ్యులు ఈ సమస్యపై తగిన శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి, పాఠశాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

