మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ ఫూల్ సింగ్ నాయక్
వెల్దండ, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): మండలంలోని సర్పంచులకు అన్ని విషయాల్లో అండగా నిలబడి, గ్రామాల సమగ్ర ప్రగతికి తన వంతు సహకారం అందిస్తానని మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ ఫూల్ సింగ్ నాయక్ అన్నారు. బుధవారం వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్పంచుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతనంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి సర్పంచుల సమిష్టి కృషి ఎంతో అవసరమని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచుల ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న ఆమె, ప్రతి సర్పంచ్‌కు అవసరమైన సహాయం అందిస్తూ, మండల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
