గచ్చుబావి శివాలయ పునరుద్ధరణకు చేయూత
గచ్చుబావి శివాలయానికి చేయూత
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి, జనవరి 5 (మనఊరు ప్రతినిధి): పురాతన ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, శిథిలావస్థకు చేరిన గచ్చుబావి శివాలయ పునరుద్ధరణకు తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రసిద్ధ పురాతన గచ్చుబావి శివాలయం, కోనేరును ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా శివాలయంలో ఆయన ప్రత్యేక పూజాలు చేశారు. గత 50 రోజులుగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన గచ్చుబావి శివాలయం ప్రజల సహకారం, దృఢ సంకల్పంతో పునరుద్ధరణ పనుల ద్వారా నూతన వైభవాన్ని సంతరించుకుంటోందని తెలిపారు. ఈ మహత్తర కార్యక్తరమంలో తమను భాగస్వామిగా చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆలయం, కోనేరి అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. పురాతన దేవాలయాల సంరక్షణతో పాటు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడం సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్నారు, గచ్చుబావి శివాలయాన్ని భవిష్యత్‌లో ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గత 50 రోజులుగా స్వామి సేవలో భాగంగా ముందుకు వస్తున్న కల్వకుర్తి ప్రజలు, యువత సేవాభావం అభినందనీయమని, వారి అంకితభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గచ్చుబావి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







