మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

ఘనంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి  

కోడుగల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

జడ్చర్ల రూరల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు అనసూయ, ఉమాదేవి, అంజలి దేవిలను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది. వారి సేవలను కొనియాడుతూ శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, మహిళలను వంటింటికే పరిమితం చేయాలన్న సామాజిక ఆలోచనలను ఎదుర్కొని, ఆడపిల్లల చదువుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయురాలిగా ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచి, బాలికల కోసం పాఠశాలలు స్థాపించి విద్యా విప్లవానికి బాటలు వేసిన సావిత్రిబాయి పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఉపాధ్యాయులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Previous Post Next Post