సంక్రాంతి రద్దీతో ఆర్టీసీ అదనపు చార్జీల వసూళ్లు…
ప్రయాణికుల ఆవేదన
నాగర్ కర్నూలు, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలు, గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో సాధారణ టికెట్ రేట్లకు అదనంగా హైదరాబాద్ నుంచి రూ.50, మైసిగండి నుంచి రూ 30 అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ సొంత గ్రామాలకు చేరుకునేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడగా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా టికెట్ ధరలు పెంచడం అన్యాయమని పలువురు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ, టికెట్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని వారు వాపోతున్నారు. అదనపు చార్జీల వసూళ్లపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
