జడ్చర్ల పీహెచ్‌సీని డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ఆకస్మిక తనిఖీ
జడ్చర్ల, జనవరి 21 (మన ఊరు ప్రతినిధి): జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్. కృష్ణ మంగళవారం జడ్చర్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో ప్రజలకు అందిస్తున్న వైద్య, ఆరోగ్య సేవలపై సమగ్రంగా పరిశీలన చేపట్టారు. ఓపీ సేవలు, మందుల లభ్యత, రోగుల నమోదు విధానం, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించిన డీఎంహెచ్ఓ సిబ్బంది హాజరు పట్టికను కూడా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన, సమయానుకూల వైద్య సేవలు అందేలా మరింత బాధ్యతతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంహెచ్‌ఎన్‌సీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్, పట్టణ వైద్యాధికారి డాక్టర్. మనుప్రియతో పాటు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.


