సింధూర గణపతి దేవాలయం వద్ద ఘనంగా భోగిమంటల వేడుకలు
జడ్చర్ల మునిసిపల్ కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి
జడ్చర్ల రూరల్, జనవరి 14 (మనఊరు ప్రతినిధి): పాత ఆలోచనలు, అలవాట్లు, ద్వేషాలను వదిలి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించే పండుగే భోగి అని మునిసిపల్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మునిసిపల్ పరిధిలోని 24వ వార్డులో సింధూర గణపతి దేవాలయం సమీపంలో భోగిమంటల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగి రోజు వేకువజామున వెలిగించే మంటలు పరివర్తనకు సంకేతమని తెలిపారు. ఇంట్లోని పాత వస్తువులు, పనికిరాని సామాగ్రిని మంటల్లో వేయడం వెనుక ఉన్న అంతరార్థం మనలోని పనికిరాని పాత ఆలోచనలు, అలవాట్లు, ద్వేషాలు, జడత్వాన్ని వదిలిపెట్టడమేనని వివరించారు. అగ్ని ఏ విధంగా వస్తువులను దహించి బూడిద చేస్తుందో, అలాగే మనసులోని నెగిటివ్ భావాలను తొలగించుకుని, స్వచ్ఛమైన మనసుతో, కొత్త ఆశయాలతో జీవితంలో ముందడుగు వేయాలని భోగి పండుగ బోధిస్తుందన్నారు. ఇలాంటి పండుగ వేడుకలు మన సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావి తరాలకు అందించేందుకు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య పాల్గొని భోగి నృత్యాల్లో పాల్గొంటూ భక్తులతో కలిసి ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. దేవాలయం తరఫున హిందూ బంధువులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగిమంటల కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

